Purushottama Patnam

ఓం శ్రీ సాయిరాం

పురుషోత్తమ పట్టణము గ్రామ చరిత్ర

నామాట

ఒక గ్రామం యొక్క పుట్టు పూర్వోత్తరాలను లిఖించడానికి లెక్కకు మించిన దిర్యం కావాలి. రచయితకు పరిశోధాత్మక దృక్పధం అవసరం గ్రామంతో, గ్రామంలోని ప్రజానీకంతో సంబంధబాంధవ్యాలు తప్పనిసరి. గ్రామ చరిత్రలు ఎప్పుడూ ఊహల నుండి, కల్పనల గథా ప్రవాహంలో నుంచి ఆవిర్భవించకూడదు. ఆ గ్రామం యొక్క పురాతన సంస్కృతి సంప్రదాయాలను గ్రామ చరిత్రలోని ప్రతి పేజీ చదువుకోవడానికి ఉత్కంత భరితంగా ఉంటుంది.

నా జన్మస్థానమైన పురుషోత్తమపట్నం గ్రామం యొక్క చరిత్రను రాయాలని నాకు ఎప్పటినుండియో కోరిక వున్నది. కానీ, సుదీర్ఘమైన పరిశోధన అవసరమై వున్న కారణంగా ఆలస్యమై కార్యరూపం దాచలేదు. అయితే మా అన్నగారైన విడదల లక్ష్మీనారాయణ గారి ద్వితీయ పుత్రుడు చిరంజీవి రామచంద్రప్రసాద్ అభీష్టం మేరకు ఈ రచనా ప్రక్రీయ వేగవంతమైంది.

ఉద్యోగరీత్యా జర్మనీలో వుంటున్న రామచంద్రప్రసాద్ పలుమార్లు ఫోన్ ద్వారా నాతో మాట్లాడి ఈ గ్రామ చరిత్రను రాసే కార్యక్రమంలో నన్ను ముందుకు నడిపించాడు. ఎన్నో విషయాలను సేకరించి నాకు అందజేశాడు. రామచంద్రప్రసాద్ పట్టుపట్టి నాచే ఈ గ్రంధాన్ని రాయించాడని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. గ్రామ చరిత్ర యెడల ఎంతో ఉత్సుకతను చూపిన చిరంజీవి రామచంద్రప్రసాదును నిండు మనసుతో అభినందిస్తున్నాను.

పురాతన శిలాఫలకాలు, గ్రామపెద్దలు, ప్రముఖుల ద్వారా సేకరించిన విషయములు మరియు నా పరిశోధనా ఫలితంగా వెలుగులోకి వచ్చిన వాస్తవముల సమాహారమే ఈ గ్రంధం.

“పురుషోత్తమ పట్టణము”

పురుషోత్తమ పట్టణము గ్రామము కోల్ కత్తా – చెన్నై జాతీయ రహదారికి పడమర దిశగా విస్తరించి యున్నది. ఈ ప్రాంతము గుంటూరు నగరమునకు దక్షిణము దిక్కున 38 కిలో మీటర్ల దూరములో కేంద్రీకృతమై వున్నది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణమునకు 60 కిలో మీటర్ల దూరములో ఉత్తరం దిక్కున వున్నది.

5 వ నెంబర్ జాతీయ రహదారికి చేరువుగా, గుంటూరు, ఒంగోలు పట్టణాలకు మధ్యభాగంలో వుండుటవలన ఈ గ్రామమునకు ప్రత్యేకమయిన గుర్తింపు లభించింది. అంతేకాదు ప్రాచీనకాలం నుండి ఈ గ్రామం ఓ ప్రత్యేకతను కలిగివున్నది.

జిల్లా రెవెన్యూ రికార్డుల ప్రకారం పురుషోత్తమ పట్టణము ” శివారు ” గ్రామముగా గుర్తించబడి తాలూకా కేంద్రమైన ” చిలకలూరిపేట ” పట్టణమునకు ముఖద్వారమై విరాజిల్లుచున్నది. ఈ కారణముగా గుంటూరుజిల్లా రెవిన్యూ రికార్డుల ప్రకారము “పురుషోత్తమ పట్టణము శివారు చిలకలూరిపేట గ్రామము ” అను విధముగా ప్రతి ప్రభుత్వ రికార్డులలో నమోదు కావటం గమనార్హం.

పూర్వం నుండి గ్రామాధికారి వ్యవస్థలో భాగమైన ” మున్సబు ” మరియు ” కరణం ” గిరీలు కూడా చిలకలూరిపేట పట్టణము మొత్తమునకు ” పురుషోత్తమపట్టణము ” మున్సబు మరియు పురుషోత్తమ పట్టణం కరణం ” గా వ్యవహరించడం జరుగుతోంది.