3. ప్రత్యేకతలు

పురుషోత్తమపట్టణం ప్రత్యేకతలు / విశిష్టతలు

పురుషోత్తమపట్టణము గ్రామము సంస్కృతి, సంప్రదాయాలతో బాటు ఎన్నో విశిష్టతలు ఈ గ్రామంలో నెలకొనివున్నాయి. గ్రామీణ సాంప్రదాయ వేడుకలు పెద్దకాపు, చిన్నకాపు కుటుంబముల నేతృత్వంలో ప్రతి సంవత్సరము ఘనంగా జరిగేవి. ఈ వేడుకలలో గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పాల్గినేవారు. గ్రామ దేవత పోలేరమ్మ కొలుపులతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత వరుసగా మహాలక్ష్మీమ్మ, అంకమ్మతల్లి, పోతురాజు దేవతల కొలుపులు జరిగేయి. చివరిగా వనభోజనములతో ఈ కొలుపుల వేడుకలకు ముగింపు పలికేవారు. దాదాపు 30 రోజుల పాటు గ్రామ ప్రజలందరూ ఒక్కటిగా కలసిపోయి, కులమత భేదాలను మరచిపోయి సంబరాలు జరుపుకొని ఐక్యతను చాటేవారు. ఈ సంప్రదాయమే ఈ గ్రామంలోని ప్రజలందరూ ఐకమత్యంతో సహజీవనం సాగించడానికి దోహదం చేసింది.

ఈ గ్రామమునకు చెందిన మాలపల్లె (ప్రస్తుతం సంజీవ నగర్) మాదిగపల్లె (ప్రస్తుతం ఆది ఆంధ్రకాలినీ) వాసులు గ్రామంలోని పెద్దల కుటుంబాలతో అన్యోన్యంగా వుంటూ, వారికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనమును కొనసాగించేవారు. తెలగ కులస్తులైన పెద్దలు కన్న బిడ్డల వలె ప్రేమించి ఆదరించి వారి కుటుంబముల పోషణ భాద్యతలను కూడా నిర్వర్తించేవారు. ఈ కారణంగా ఎక్కువ – తక్కువ, చిన్న – పెద్ద అనే భేదభావములు కానరాక అందరూ కలసిమెలసి ఒకే కుటుంబ సభ్యుల వలె సహజీవనం సాగించేవారు.

ఈ గ్రామములో పెక్కు దేవాలయములు గలవు. భారతదేశంలోని ఏ గ్రామంలో కూడా ఇక్కడ నెలకొనివున్నన్ని దేవాలయములు లేవని ఎందరో ప్రముఖులు ప్రశంసించడం జరిగింది. గ్రామం నడిబొడ్డున బొడ్డురాయి ( సీతమ్మతల్లి ) కొలువైవున్నది. ” దక్షిణం ముఖంతో ప్రతిష్టించబడిన వినాయకుని ” గుడి యస్.పి.టి.ఆర్.కె.యమ్. హైస్కూలు ప్రారంభమున కలదు.

పురాతన చరిత్ర గలిగిన రుక్మిణీ సత్యభామా సమేత శ్రీవేణుగోపీనాధస్వామి దేవాలయం గ్రామంలోని కోటప్పకొండ మార్గము ప్రక్కనే వున్నది. దేవాలయం, ” కళ్యాణ మండపము” కూడా దేవాలయం రాజగోపురమునకు ఎదురుగా ప్రతిష్టంపబడి వున్నది. ఈ కళ్యాణమండపము ప్రక్కనే ” శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవాలయము ” ఉత్తరముఖముతో నిర్మించబడివున్నది.

అద్భుతమైన మహిమలతో ఈ గ్రామ ప్రజలనేగాక పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలను గూడా ఆకర్షిస్తోన్న ” శ్రీషిర్డిసాయిబాబా వారి మందిరము” ఈ గ్రామానికే ప్రత్యేకతను తీసుకొని వచ్చింది. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడాలేని విధముగా ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించబడిన ” శ్రీ దత్తాత్రేయ షోడషావతర స్థూపం 153 అడుగుల ఎత్తులో విలసిల్లుతూ ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షిస్తోంది “.

ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకుల రోజున ” ( మార్గశిర పూర్ణిమ ) ” ఈ మందిర ప్రాంగణంలో నిర్వహించే దీపయజ్ఞము (2013 లో 9 కోట్ల వత్తులతో నిర్వహించబడినది.) అనన్య సామాన్యమైనది. ఈ వేడుకలలో పాల్గొనడానికి భక్తులు వేలాదిగా తరలి వస్తారు.

పోలేరమ్మ తల్లి ఆలయం, అంకమ్మ తల్లి ఆలయం, పోతురాజు గుడి ఈ గ్రామానికి రక్షణ కవచాలుగా భావిస్తారు. ” కూనపరెడ్డి ” కుటుంబాల వారు ” పోతురాజు ” ను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. పురాతనమైన ” శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ” ఆలయమును ఆధునిక మందిరముగా తీర్చిదిద్ది పునర్మిర్మాణము చేయుట జరిగినది. ఒగేరు దారిలో ” శ్రీ నాగేంద్రస్వామి ఆలయమును” నిర్మిచడం జరిగినది. ఓగెరు ఒడ్డున ” శ్రీ నీలకంటేశ్వర స్వామి” ఆలయమును నిర్మించినారు.

పురాతనమైన ” రామమందిరము ” ను క్రొత్తగా పునర్మిర్మాణము చేయుట జరిగినది. ” పురాతనమైన శివాలయము ” కోటప్పకొండ ప్రధాన రహదారిపై దక్షణ ముఖద్వారముతో నిర్మించబడియున్నది. రాచుమల్లు వారి కుంట రోడ్డులో ” శ్రీ ఉమామలేశ్వర స్వామి దేవాలయము ” నిర్మిచబడినది. ఈ గ్రామంలోని యాదవులు తమ కుల దేవత ” గంగమ్మ తల్లి ” గుడిని ప్రత్యేకముగా వారి గృహసముదాయాల నడుమ నిర్మించుకొని ప్రతి సంవత్సరము కొలుపులు నిర్వహించుకుంటూ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు.

ఈ గ్రామమునకు మరో ప్రత్యేకత కలదు. మహమ్మదీయుల నివాస గృహముల నడుమ ” శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయము” ప్రాచీన కాలములో నిర్మించబడినది. ఆ ప్రాంతంలో శ్రీఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలసిననాడని అక్కడ నుంచి తనను వేరే చోటుకు తరలించవద్దని, అక్కడనే దేవాలయమును నిర్మించవలసినదిగా భక్తునికి స్వప్నంలో సాక్షత్కరించి ఆదేశించినాడని గ్రామస్తుల విశ్వాసం. ఆ కారణంగా అక్కడనే దేవాలయం నిర్మించడం జరిగిందని గ్రామ ప్రజలు చెప్పుకుంటూ వుంటారు. ఇదే విధముగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం కూడా మహమ్మదీయులు నివసించే ప్రాంతములోనే నిర్మించడం జరిగింది.

హిందువులైన గ్రామ ప్రజలు పర్వదినాల సందర్భముగా, వివాహవేడుకల సందర్భముగా మేళతాళాలతో, ఊరేగింపుగా శ్రీఆంజనేయస్వామి వారిని, శ్రీపోలేరమ్మ తల్లిని దర్శించుకుంటూ వుంటారు. హిందువులు నివసించే ప్రాంతంలో ఊరిచివర మహమ్మదీయుల ” ఈద్గా ” నిర్మించబడినది. మహమ్మదీయుల పండుగల సందర్భముగా ముస్లిం సోదరులు ఈద్గాను సందర్శించి ప్రార్థనలు చేసుకోవడం జరుగుతుంది. ఒకరి ప్రాంతం నుంచి మరొకరు నిమిత్తం ఊరేగింపుగా వెళ్లడం వలన మతసామరస్యం వెల్లివిరుస్తుందని, తద్వారా రెండు మతాలకు చెందిన ప్రజలు అన్నదమ్ముల వలె కలసిమెలసి సుఖజీవనం సాగించగలరని ఓ ప్రగాఢ విశ్వాసంతో గ్రామానికి చెందిన పూర్వికులు ఈ విధమైన నిర్మాణాలను చేసివుంటారని గ్రామస్తుల విశ్వాసం. పూర్వీకుల నమ్మకాలను నేటి తరం వారు కూడా ఆచరిస్తూ వుండటం ఈ గ్రామప్రజల గొప్పతనంగా భావించవలసివస్తోంది. మత సామరస్యానికి ప్రతీకగా పురుషోత్తమపట్టణము గ్రామం విరాజిల్లుతోంది.