“పురుషోత్తమ పట్టణము” ఆవిర్భావము
క్రీ|| శ ||. 1462 సంవత్సరంలో ” కొండవీడు ” ను రాజధానిగా చేసుకొని గుంటూరు సీమను పరిపాలించిన పురుషోత్తమ గజపతి, ఆయన కుమారుడు రెండవ పురుషోత్తమ గజపతి ఈ గ్రామమును నిర్మించిరి. వారు తమ పేర్లను చరిత్రలోచిరస్తాయిగా వుండునట్లు ఈ గ్రామమునకు” పురుషోత్తమపట్టణము” అను నామమును నిర్ణయించిరి.
పూర్వము కర్ణాటక రాజులలో అగ్రగణ్యుడైన పూసపాటి కపిలేశ్వర గజపతి క్రీ||శ|| 1354 సంవత్సరం మొదలు 1376 వరకు కొండవీడు సామ్రాజ్యమును పాలించినాడు. అతని తదుపరి ఆరాజు కుమారుడు పూసపాటి వీరపురుషోత్తమగజపతి క్రీ||శ|| 1418 వరకు పరిపాలించెను.
ఈ రాజు కుమారుడైన పూసపాటి ప్రతాపరుద్రగజపతి క్రీ||శ|| 1419 మొదలు 1437 వరకు పరిపాలించెను. ఈ రాజుల పాలనలో పురుషోత్తమపట్టణం నిర్మాణం జరిగినట్లు చారిత్రక పరిశోధనల ద్వారా వెల్లడయినది.
పూసపాటి వీరప్రతాపపురుషోత్తమగజపతి ప్రజలకు కన్న బిడ్డలవలె పాలించెనని, చరిత్రలో లిఖించబడియున్నది. ఆ కారణముగా ఆరాజును పురుషోత్తముడని ప్రజలు కొనియాడెడివారు. ప్రజల కోరిక మేరకు తన పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండునట్లు “పురుషోత్తమపట్టణం” అను పేరుతో ఒక పురమును నిర్మిచినట్లు కొండవీడు చరిత్ర పరిశోధనలో వెల్లడైనది.
ఈ పురుషోత్తమపట్టణము “అడ్డగడపేట” కు పడమటి దిశన (నేటి చిలకలూరిపేట అడ్డరోడ్డు) నిర్మాణము చేయుట జరిగినది. ఈ విధముగా నిర్మాణము జరిగిన తరువాత తన ఔదార్యమును తెలియజేయుచూ ఒక శాసనమును కూడా వ్రాయించెనని ఆ శాసనము కూడా పురుషోత్తమపట్టణము గ్రామములో వుండివుండునని పరిశోధకులు తెలియజేసినారు. ఆ శాసనము ఈ క్రింది విధముగా లిఖిచబడియున్నది.
” శ్రీ చతుర్దశ భువనాధిపతి, శ్రీమత్పురుషోత్తమ దివ్యచరణసేవ శతానవ వుంచాన వైరిమర్దన భుజాబల పరాక్రమ పరమ వైష్ణవ పరమ భట్టారక భాగవతకారణ శ్రీపురుషోత్తమ పుత్ర సూర్యవంశధార మహారాజాధిరాజ రాజపరమేశ్వర ఇక్ష్వాకు కులసంభవ రామచంద్ర చరిత్రాలంకృత పాతనాటి మండలేశ్వర నవకర్ణాకాలంబరేశ్వర పంచనాదేశ్వర
శ్రీవీరప్రతాప పురుషోత్తమదేవ మహాలంకార విజయరాజ్య సమస్త శ్రాయికన్యాశుద్ధ పంచమి శుక్రవారం స్వస్తివర్షంబులు, పదునాలుగు నూర్ల పదునొకొడవదుగు నేటి కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పంచమి శుక్రవారం దుర్గాప్రసాద కొండవీటి సమస్త దేశాలమాల అష్టాదశ వర్ణాల ప్రజలకున్నూ, పెడ్లి సుంకములు కరణాలు, తెలుగురాజులు ఎవరైనా తప్పితే గోహత్య బ్రహ్మహత్య శిశు హత్య చేసిన పాపమునబోదురు. తురకలు పందిని దిన్నపాపానబోదురు.”
” కొండవీడు” సంస్థానమును పరిపాలించిన రాయరావు 1505 వ శకవర్షమున కొండవీటి సీమను 14 సముతులుగా విభజించి పరిపాలనా భాద్యతలను కొందరు జమీన్ దారులకు అప్పగించెను. కొండవీటి సీమలోని సముతులు ఈ క్రిందివిధముగా విభజింపబడినది. (1) పాలడుగు (2) పత్తిపాడు (3) నూతక్కి (4) పొన్నూరు (5) శ్రీ కూచిపూడి (ప్రస్తుతం – కూచిపూడి) (6) సంతరావూరు (7) పులివర్రు (8) రావిపూడి (9) మానుగోడు (10) గుంటూరు (11) చేబ్రోలు (12) తాడికొండ (13) నాదెండ్ల (14) దండిమంగళగిరి (ప్రస్తుతం-మంగళగిరి).
ప్రతి సమితి ఏలుబడిలో కొన్ని గ్రామములు కలవు.ఈ విధముగా సముతుల పాలనలో వున్న గ్రామాల పెత్తనం రాయరావు ప్రభువు నిర్ణయించిన జమీన్దార్ మజుందార్ అని కితాబునిచ్చి వారి పాలనలో పురుషోత్తమపట్టణము ఉండునట్లుగా రాయరావు ప్రభువు శాసించినట్లు కొండవీడు చరిత్రలోని ఆధారాలు తెలియజేయుచున్నాయి.
ఈ పురుషోత్తమపట్టణము గ్రామము నుండి కోటప్పకొండకు ప్రధాన రహదారి కలదు. ఇచ్చటికి 12కి|| మీ || దూరంలో కోటప్పకొండ కలదు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ గ్రామం చివర పడమటి దిక్కున వున్న ముస్లింల పవిత్రస్థలం ” ఈద్గా ” నుండి తూర్పు వైపు దాదాపు 5 కి||మీ || వరకు అడ్డరోడ్డును దాటి పురుషోత్తమపట్టణం విస్తరించియున్నది. ” కొండవీడు” చరిత్రలో లిఖించినట్లు తూర్పు, ఆగ్నేయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం, శంకరేశ్వరస్వామి ఆలయం (ప్రస్తుతం గంగాబాలాత్రిపురసుందరీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం) లు నిర్మించబడినవి.
ఈ దేవాలయములకు పురుషోత్తమపట్టణము నివాసగృహములకు నడుమ దాదాపు 3 కి||మీ || విస్తీర్ణము (అడ్డరోడ్డు వరకు) పలురకముల ఫలములతో కూడిన తోటలతో నిండివున్నది. బత్తాయి, నారింజ, జామ, తోటలతో ఈ ప్రాంతమంతయు కళకళలాడుతూ వుండేది. ఈ తోటలపై ” రామచిలుకులు ” గుంపులు గుంపులుగా వాలి జామ పండ్లను రుచి చూసి వెళ్ళేవి. ఈ రామచిలుకల గుంపును గమనించిన పురుషోత్తమపట్టణము ప్రజలు ఈ తోటలు విస్తరించి వున్న ప్రాంతమునకు ” చిలకలతోట ” అని పేరు పెట్టిరి.
కోల్ కత్తా – చెన్నై రహదారిని (ప్రస్తుతం యన్ .హెచ్-16, అప్పుడు యన్.హెచ్-5) అడ్డరోడ్డుగా వ్యవహరించే గ్రామ ప్రజలు అప్పటి వరకు ఈ ప్రాంతమును ‘ అడ్డగడపేట ‘ గా వ్యవహరించినారు. ఆ తరువాత ” చిలకల తోట ” గాను, అటు పిమ్మట ” చిలకలమర్రి ” గాను ఈ ప్రాంతం రూపాంతరం చెందినది. కానీ, జమీన్ దార్ వారి ఆదేశములు నేటికీ అమలు జరుగుతూనే వున్నాయి.
రాయరావు ప్రభువు 1462 ప్రాంతంలో నిర్మించిన శ్రీలక్శ్మీనరసింహస్వామి దేవాలయం, విష్ణ్వాలయం (ప్రస్తుతం రామాలయం) లకు సంబందించిన రధోత్సవములు నేటికీ పురుషోత్తమపట్టణము గ్రామమునకు చెందిన ” పెద్దకాపు” గారి కుటుంబవారసుల నేతృత్వములో జరుగుట గమనార్హం.
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం రధం (పెద్దరధం), విష్ణ్వాలయం ( రామాలయం ) రధం రెండు గూడా ఉత్సవమూర్తులతో పురవీధుల గుండా ప్రయాణించి అడ్డరోడ్డు దగ్గర ఆగి భక్తులకు తీర్ధప్రసాదములు ఇచ్చిన తదుపరి పురుషోత్తమపట్టణం ” పెద్దకాపు” కుటుంబవారసులు మేళతాళాలతో వచ్చి స్వామి వారికి పానకం, వడపప్పు, పట్టువస్త్రములు, అమ్మవారికి పసుపు, కుంకుమలతో కూడిన చీరెసారెలు సమర్పించెదరు. ఈ తతంగం అంతయు శాస్త్రోక్తముగా వేదపండితుల సమక్షములో జరుగును.
ఈ ఉత్సవంలో జమిందార్ మంజుదార్ వారసులు గూడా పాల్గొనడం జరుగుతుంది. పురుషోత్తమపట్టణము గ్రామం యొక్క పరిధిని, విశిష్టతను ఈ ఉదాహరణ ద్వారా విశదీకరించడమైనది. ఆ తదుపరి కాలక్రమములో గ్రామం విస్తరించబడినది, పండ్ల తోటలు నిర్మూలించబడినాయి. ఆప్రదేశములలో జనావాసాలు నిర్మించబడడినాయి. ” చిలకలతోట ” పేరు సంవత్సరాలు గడిచిన పిదప ” చిలకలూరిపేట ” గా వాడుకలోకి వచ్చింది.
అడ్డరోడ్డు – జాతీయ రహదారి ( యన్. హెచ్ – 5, ప్రస్తుతం యన్. హెచ్ – 16 ) గా రుపాంతరం చెందింది . ఈ రోడ్డుకు పడమటి భాగమును ” పురుషోత్తమపట్టణము ” గా తూర్పు భాగమును ” చిలకలూరిపేట ” గా వ్యవహరించడం ప్రజలకు అలవాటుగా మారిపోయింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం గూడా యన్.హెచ్-5 ను కేంద్రంగా తీసుకొని చిలకలూరిపేట పురపాలక సంఘంగా నామకరణం చేసింది. కానీ, పురుషోత్తమపట్టణము యొక్క మూలాలను మాత్రం మార్పు చేయలేదు.
పురుషోత్తమపట్టణము శివారు చిలకలూరిపేట గ్రామముగా ప్రభుత్వ రికార్డులలో ఇప్పటికీ నిక్షిప్తమై ప్రభుత్వ వ్యవహారాలకు సంబందించిన అన్ని కార్యక్రమాలలోనూ పురుషోత్తమ పట్టణము పేరు ప్రముఖంగా లిఖించబడుతోంది. అంతేకాదు శ్రీలక్శ్మీనరసింహస్వామి, రామాలయములకు చెందిన రధోత్సవములు నేటికీ సంప్రదాయానుసారం నిర్వహిచబడటం వలన ఈ ప్రాంతం అంతయూ ” పురుషోత్తమపట్టణము ” గ్రామముగానే పరిగణించవలసిన వాస్తవమును తెలియజేయుచున్నది.