6. కళాకారులు

కళాకారులు & రచయితలు

కళామతల్లి సేవలో తరించిన కళాకారులు, సాహితి సరస్వతి సేవలో తరించిన రచయితలు ఈ గ్రామంలో వున్నారు.

హరికథలు చెప్పి, ప్రజల హృదయాలను రంజింపచేసిన శ్రీ.శ్రే. విడదల వెంకయ్య గారు గుంటూరు జిల్లాలో ప్రముఖంగా గుర్తింపు పొందినారు. ప్రముఖ రంగస్థల, సినీ నటులు శ్రీ తోట నరసింహారావు గారు ఆంధ్రరాష్ట్రంలో ప్రముఖ రంగస్థలనటునిగా, నాటక రచయితగా గుర్తింపు పొందినారు. వీరు కీర్తిశేషులు, ” రక్తకన్నీరు” నాగభూషణంతో కలసి కొన్ని నాటకములలో నటించినారు.

ఇప్పటికీ, రంగస్థల, టి.వి, సినీనటుడుగా కొనసాగుతున్న ఈ గ్రంథ రచయిత విడదల సాంబశివరావు పురుషోత్తమపట్నం వాసే కావడం గమనార్హం. 1968 నుండి నేటి వరకు విడదల సాంబశివరావు నటుడిగానే కొనసాగుతూనే వున్నాడు.

పలు నాటకాలు, నాటికలలో విభిన్న పాత్రలు పోషించి దాదాపు 2000 పై నాటక ప్రదర్శనలు ఇచ్చినారు. అంతేకాదు ప్రముఖ సినీ నటులు దాదాసాహెబ్ఫాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి బావమరిది మరియు వియ్యంకుడి పాత్రలో ” మట్టిమనిషి ” టి. వి . సీరియల్ లో 52 ఎపిసోడ్స్ లో నటించి ఈ ప్రాంతంలో ఎవ్వరికీ లభించని ప్రతేకతను కలిగివున్నారు.

వీరు రచనలు పలు పత్రికలలో ప్రచురించబడినాయి. వీరు ” విడదల నీహారిక ఫౌండేషన్ ” పేరుతో ఓ సేవాసంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో తోట కోటేశ్వరరావు ( రిటైర్డు టీచర్ ), విడదల కృష్ణబాబు, ఏకాంబరపు రామ్మోహనరావు, గోవిందు సాంబశివరావు, తోటకోటి సుబ్బారావు, దేవిరెడ్డి ఆదినారాయణ, కూనపరెడ్డి సత్యనారాయణ, విడదల శంకరరావు, బైరా మనోహర్, కీ. శే. అచ్చుకోల వెంకటసుబ్బయ్యపంతులు, విడదల వెకయ్య ( తండ్రి రాఘవయ్య ) , తోట హనుమంతరావు, మల్లెల జగన్నాధం, నున్నా బ్రహ్మానందం, తోట బ్రహ్మానందం, విడదల నాగేశ్వరరావు, దారం రంగారావులు కూడా రంగస్థల నటులుగా వెలుగొందినారు. గుంటుపల్లి గురునాధం డోలు విద్వంసుడిగా రాష్ట్రస్థాయి కీర్తిని ఆర్జించినారు. ప్రముఖ సినీ దర్శకుడు తోట క్రిష్ణ, ( కీ. శే. తోట సుబ్బారావు గారి కుమారుడు ) బలిపీఠం పై భారతనారి, పుట్టింటి పట్టు చీర, ఉన్మాది మొదలైన దాదాపు 15 సినిమాలకు దర్శకత్వం వహించారు.