మహాశివరాత్రి
ఈ గ్రామములో మహాశివరాత్రి తిరుణాళ్ల వేడుకలను ఘనముగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పూర్వకాలము నుండి కోటప్పస్వామికి ప్రభలను కట్టి మొక్కులు చెల్లించుకోవడం ఈ గ్రామ ప్రజల ఆచారం. ఈ చుట్టు ప్రక్కల గ్రామాలలో గ్రామానికి ఓక్క ప్రభ మాత్రమే తిరునాళ్ళకు తీసుకువెళ్ళేవారు. కానీ, పురుషోత్తమపట్టణము నుండి దాదాపు 20కు పైగా ప్రభలు నిర్మించి కోటప్పకొండకు తరలించేవారు. ఈ గ్రామములోని ప్రతి కుటుంబం ఒక ప్రభను నిర్మించడం ద్వారా గ్రామములో తిరునాళ్ల వాతావరణం కొట్టవచ్చినట్లు కనిపించేది.
దేశవిదేశాలలో ఉన్న బంధువులు, స్నేహితులు, ఈ తిరునాళ్ల ఉత్సవాలలో పాల్గొనాలని ప్రత్యేకించి శివరాత్రి పండుగకు గ్రామానికి రావటం ఆనవాయితీగా మారిపోయింది. ఒక్కొక్క ప్రభకు పది లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించడం జరుగుతుంది. తిరునాళ్ళకు ముందురోజు మరియు తిరిగి వచ్చిన తరువాత విద్యుత్ ద్దీప కాంతుల మధ్య ప్రభలపై నృత్య గానాదులతో వేడుకలు నిర్వహించడం ప్రభల నిర్వాహకులు ఓక సంప్రదాయంగా నేటికీ కొనసాగిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ ప్రభలు నిర్మించి తిరునాళ్ళకు తీసుకువెళ్లడం పురుషోత్తమపట్నంలో తప్ప మారి ఏ ఇతర గ్రామాలలోను లేదని ప్రజలు భావించడం ఈ గ్రామానికి గర్వకారణం.