చిలకలూరిపేట బైపాస్‌కు రూ.600 కోట్లు

  1. గణపవరం – మురికిపూడి వరకు 16.48 కి.మీ. నిర్మాణం (యడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి చిలకలూరిపేట మండలం కోనాయకుంట వరకు)
  2. వంతెనలు – మూడు ప్లైఓవర్లు, ఐదు చోట్ల అండర్‌పాస్‌లు
  3. 340 ఎకరాల భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్
  4. వ్యయం – రూ.600 కోట్లు
  5. అధికారులతో చర్చించిన ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ

రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు వెచ్చింపు 
దేశంలో మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను రహదారి ఏర్పాటునకు అవసరమైన భూమి కొనుగోలుకు ఒప్పుకుంది. భూ సేకరణ విషయమై వచ్చే నెలలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రైతుల నుంచి సేకరించే భూమికి పరిహారం మార్కెట్‌ ధర కంటే ఎక్కువగానే ఇచ్చే అవకాశం ఉన్నందున అభ్యంతరాలు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. రెండున్నర సంవత్సరాల వ్యవధిలో తిమ్మాపురం వద్ద నుంచి బొప్పూడి కోనాయికుంట వరకు ఉన్న 16.48 కి.మీ దూరం బైపాస్‌ రహదారి నిర్మాణం పూర్తవుతుందని జాతీయ రహదారుల నియంత్రణ సంస్థ అధికారులు వివరించారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం రహదారి నిర్మాణానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసింది. 

ఏళ్లుగా నలుగుతున్న చిలకలూరిపేట బైపాస్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. రహదారి నిర్మాణానికి రూ.600 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి చిలకలూరిపేట మండల బొప్పూడి కోనాయికుంట వరకు మొత్తం 16.48 కి.మీ మేర బైపాస్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మూడు ఫ్లైఓవర్లు, 5 అండర్‌పాస్‌ వంతెనలుంటాయి. వీటితో పాటు గణపవరం వద్ద కుప్పగంజివాగుపై, పురుషోత్తమపట్నం సమీపంలో ఓగేరువాగుపై వంతెనలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

గత ఫిబ్రవరిలో చిలకలూరిపేటకు కేంద్ర ప్రభుత్వం బైపాస్‌ వేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు బైపాస్‌ రహదారికి సంబంధించి భూమి కొనుగోలుకు అప్పట్లోనే ఒప్పందం జరిగింది. దీంతో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి రూ.600 కోట్లు బైపాస్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. రైతులకు కూడా కొత్త భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు బుధవారం గుంటూరులో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు అధ్యక్షతన సమావేశం జరిగినట్లు చిలకలూరిపేట తహశీల్దార్‌ పీసీహెచ్‌ వెంకయ్య తెలిపారు. గుంటూరులో జరిగిన సమావేశంలో జిల్లా పాలనాధికారి కాంతిలాల్‌దండే, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్‌, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. 

Leave a Reply