15 నెలలు..101 మంది మృత్యుఒడి

* రక్తమోడుతున్న రహదారులు
* 191 రోడ్డు ప్రమాదాలు
* 197 మంది క్షతగాత్రులు

నియోజకవర్గంలో ఇదీ పరస్థితి

 • ఫిబ్రవరి 23: చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఎస్‌కే సలీం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. చిలకలూరిపేట బస్టాండ్‌ ఎదురు రోడ్డు ఆటో యూ టర్నింగ్‌ తీసుకుంటుండగా గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సలీంకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో ఇతనిపై ఆధారపడిన భార్య, కుమారుడు అనాధలయ్యారు.
 • ఫిబ్రవరి 24: నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన పవన్‌కుమార్‌, సాయికుమారిలకు ప్రమోద్‌, ప్రణీత్‌(6)లు ఇద్దరు కుమారులు. తల్లి ప్రైవేటు పాఠశాలలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుంటుంది. యూకేజీ చదువుతున్న ప్రణీత్‌ను సాయికుమారి ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని చిలకలూరిపేటలో ఉన్న పాఠశాలకు బయల్దేరారు. మార్గ మధ్యంలోని బస్టాండ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కన్నతల్లి చూస్తుండగానే కుమారుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

 • మార్చి 26: ప్రకాశంజిల్లా చవిటిపాలెం గ్రామానికి చెందిన జి.వెంకటప్రసాద్‌(25) సంతమాంగులూరు మండలం గురిజేపల్లిలో ప్రైవేటు కంపెనీలో పొక్లెయిన్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. భార్యను విజయవాడలో వదలిపెట్టి చిలకలూరిపేటలో ఉన్న తండ్రిని కలిసేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద సంఘటనకు కొద్ది దూరంలో ఉన్న ప్రసాద్‌ తండ్రి సంఘటన స్థలానికి వచ్చి వెంకటప్రసాద్‌ మృతదేహం వద్ద బోరున విలపించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది.

 • మార్చి 26: చిలకలూరిపేట పట్టణం గుర్రాలచావిడికి చెందిన సయ్యద్‌ ఉస్మాన్‌, సిమియాల రెండో కుమారుడు సయ్యద్‌ సమీర్‌(5) ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. పాఠశాల వదిలిపెట్టగానే ఇంటికి వస్తున్న సమీర్‌ను నాలుగు చక్రాల ఆటో ఢీకొంది. తీవ్ర గాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.

 • చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి నెలా తరచూ వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో పలువురు మృతిచెందుతుండగా, మరికొంత మంది అంగవికలురుగా మారుతున్నారు.

 • ప్రాణసంకటంగా మారిన ప్రయాణాలు 
  చిలకలూరిపేట ప్రాంతంగుండా వెళ్లే జాతీయ రహదారి రక్తమోడుతుంది. ఈ రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారడంతో రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో యువకులు, చిన్నారులు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. ప్రధానంగా యడ్లపాడు నుంచి చిలకలూరిపేట మండలం తాతపూడి వరకు ఉన్న 14.5 కి.మీ. జాతీయ రహదారిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. చిలకలూరిపేట పట్టణం నుంచి నరసరావుపేట వెళ్లేమార్గంలో, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో ప్రమాదకర మలుపులు వద్ద వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు తరచూ ఎక్కువగా ఒకే ప్రాంతాల్లో జరుగుతున్నా అధికారులు వాటిపై దృష్టి పెట్టడం లేదు. ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కార మార్గాలను చూడాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2015 జనవరి నుంచి 2016 మార్చి వరకు 15నెలల కాలంలో మొత్తం 191 రోడ్డు ప్రమాదాలు జరగగా, వాటిలో 101మంది చనిపోయారు. 197మంది క్షతగాత్రులయ్యారు.

 • నియోజకవర్గంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు 
  చిలకలూరిపేట పట్టణంలో జాతీయ రహదారి మీద ఏఎంజీ, ఆర్టీసీ బస్టాండ్‌, విజయాబ్యాంక్‌, అడ్డరోడ్డు కూడలి వద్ద, అంతర్గతంగా పోలీసుస్టేషన్‌ మలుపు, కళామందిర్‌ సెంటర్‌ కేబీ, నరసరావుపేట రోడ్డులోని బ్యాంక్‌ కాలనీ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిలకలూరిపేట మండలంలో బొప్పూడి ఆంజనేయస్వామి గుడి సమీపంలో మలుపు ప్రాంతంలో తాతపూడి వద్ద, నాదెండ్ల మండలంలో కర్నూలు-గుంటూరు రాష్ట్రీయ రహదారిలో సాతులూరు వద్ద, గణపవరం గ్రామంలో ఎంఎల్‌ కంపెనీ సమీపంలో, సినిమాహాలు సెంటర్‌, కొత్త మార్కెట్‌యార్డు వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యడ్లపాడు మండలంలో యడ్లపాడు సెంటర్‌, పోలీసుస్టషన్‌ సమీపంలో, పార్వతిదేవి గుడి సమీపంలో, తిమ్మాపురం సెంటర్‌, మర్రిపాలెం సెంటర్‌లలో ప్రమాదా జోన్‌లుగా మారాయి.

 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.