ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

చిలకలూరిపేట మండలం బొప్పూడి కొండపై కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం కనుల పండువగా జరిగింది. గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, నవగ్రహరత్నన్యాసం, యంత్రస్థాపన, పూర్ణాహుతి, శాంతి కల్యాణం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, పశ్చిమబంగా అదనపు డీజీపీ డాక్టర్‌ బొప్పూడి నాగరమేష్‌, కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. కొండపైన, కొండ కింద అన్నదానం చేశారు. గ్రామీణ ఎస్సై ఎస్‌.జగదీష్‌ ఆధ్వర్యంలో మరో ఎస్సై వెంకటేశ్వరరాజు, ఏఎస్సై వెంకటేశ్వరరావు, రైటర్‌ జిలానీ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సర్పంచి పూసల హరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు మస్తాన్‌, ఈవో సాయిబాబు, అల్లూరి సీతారామరాజు, గ్రామస్థులు భక్తులకు సహకారం అందజేశారు.

పులకించిన బొప్పూడి కొండ మండలంలోని చారిత్రక బొప్పూడి కొండపై కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నూతన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవానికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు తరలిరావటంతో కొండ ప్రాంతం పులకించింది. మెట్ల మార్గం, తాత్కాలిక రహదారి మార్గం, దేవాలయం వద్ద, అన్నప్రసాద వితరణ ప్రాంతం ఇలా ఎక్కడ చూసినా భక్తులు కొండపై కిక్కిరిశారు. ఇక కొండ కింద నాలుగు బజారుల వైపు అన్నదానం ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా వేలాది మంది పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా నిర్వాహక కమిటీ, గ్రామస్థులు పర్యవేక్షించారు. ధ్వజస్తంభం ఏర్పాటు చేయించిన ధర్మకర్త, పశ్చిమబంగా అదనపు డీజీపీ డాక్టర్‌ బి.ఎన్‌.రమేష్‌ ఏర్పాట్లను పరిశీలించారు. 

Leave a Reply