వాడరేవు-చీరాల-నకరికల్లు రహదారి సర్వే ప్రారంభం

వాడరేవు-చీరాల-నకరికల్లు రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించటంతో సర్వే పనులు వూపందుకొన్నాయి. బెంగళూరుకు చెందిన అమృత సంస్థ సర్వే నిర్వహిస్తోంది. వాడరేవు వద్ద ప్రారంభమైన సర్వే శనివారం చిలకలూరిపేట వరకు వచ్చింది. ఈ మార్గంలో వంతెనలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలు.. ఇలా అన్ని అంశాలను సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు అవసరమైన స్థల సేకరణ ఎంత అవసరమో ఇందులో గుర్తిస్తారు. 45 రోజుల్లో సర్వే పూర్తిచేసి నివేదికను అధికారులకు అందజేస్తామని సర్వే సంస్థ నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో చిలకలూరిపేట ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వటంతో వాడరేవు నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వద్ద ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారి వరకు 81 కి.మీ దూరం నాలుగువరుసల రహదారిగా నిర్మించనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

Leave a Reply