రెండు జిల్లాల మధ్య జాతీయ రహదారి

మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఫలితం 
త్వరలో పచ్చదనం సర్వే

గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య మరో జాతీయ రహదారి రూపుదిద్దుకోబోతుంది. ప్రకాశం జిల్లా వాడరేవు- చీరాల నుంచి పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేటల మీదుగా నకరికల్లు వరకు 81 కి.మీ. రహదారిని జాతీయ రహదారిగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు అనుమతి ఇచ్చింది. కేంద్ర మంత్రి గడ్కరీ విజయవాడలో ప్రకటించిన 10 జాతీయ రహదారుల్లో ఇదొకటి.

త్వరలో రెండో సర్వే 
రాష్ట్రంలో జాతీయ రహదారుల పరిధిలో 10 శాతం పచ్చదనానికి కేటాయించాలని సీఎం ఆదేశించటం, కేంద్ర ప్రభుత్వం అంగీకరించటంతో ఈ రహదారి పరిధిలో రెండో సర్వే త్వరలో ప్రారంభం కానుంది. దానిని కూడా జాతీయ రహదారుల సంస్థ ప్రైవేటు సంస్థకు అప్పగించనుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే నివేదికను ర.భ.శా అధికారులు జాతీయ రహదారుల సంస్థకు అందజేస్తే రెండో సర్వే పనులు త్వరగా పూర్తి చేయటానికి అవకాశం ఉంటుందని ఈ రహదారి పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజా ప్రతినిధులు సూచిస్తున్నారు. చీరాల, పర్చూరు శాసనసభ్యులు, చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ జాతీయ రహదారి అభివృద్ధి మీద దృష్టి సారిస్తే సాంకేతిక పరమైన అనుమతులు, భూసేకరణ వంటి అంశాల్లో ఎదురయ్యే సమస్యలు త్వరగా పరిష్కరించవచ్చంటున్నారు. దాని వలన నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించటానికి అవకాశం లభిస్తుందని సూచిస్తున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు నిధుల కొరత లేకపోవటంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమయన్యయంతో పనిచేస్తే మరో ఏడాదిలోనే ఈ మార్గానికి జాతీయ రహదారి రూపు కల్పించవచ్చని ర.భ. శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు.

ప్రాధాన్యం ఇలా పెరిగింది 
ఇప్పటి వరకు రెండు జిల్లాల మధ్య విపరీతమైన రద్దీతో ఉండే ఈ మార్గాన్ని రాష్ట్రీయ రహదారిగానే ఉంచారు. 2013లో జాతీయ రహదారిగా మార్చాలంటూ ప్రతిపాదించినా కదలికలేదు.మూడేళ్ల నుంచి రహదారులు, భవనాల శాఖ కింద ఉన్న దీనిని అభివృద్ధి చేయటానికి ఎప్పుడూ నిధులు కొరతే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబునాయుడు రహదారుల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, ఈ రహదారి పరిధిలోని ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద కొమ్మమూరు కాలువ ద్వారా జల రవాణా త్వరలో అందుబాటులోకి రానుండటం కలిసి వచ్చాయి. తీర ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వటంతో చీరాల పక్కనే గల వాడరేవుకు కూడా ప్రాధాన్యత పెరిగింది. అక్కడి నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి 81 కి.మీ. దూరం అభివృద్ధి చేస్తే నకరికల్లు వద్ద హైదరాబాద్‌ రహదారిని కలుస్తుంది. ఇలాంటి ప్రధాన అంశాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటంతో జాతీయ రహదారిగా మార్చేందుకు అనుమతి లభించింది.

గతంలో ఒకసారి 
రాష్ట్రీయ రహదారిగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే నిర్వహించింది. అభివృద్ధికి రూ.600 కోట్ల నిధులు అవసరమని ర.భ. అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మార్గంలో ఇరుకుగా ఉన్న చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు వద్ద బైపాస్‌ నిర్మించాలని సర్వే జరిపిన ప్రైవేటు సంస్థ సూచించింది. 24 గంటలూ రద్దీ ఉండటంతో ప్రయాణించే వాహనాల సంఖ్య ,రహదారి వెడల్పు, పటిష్టత, చెట్లు, ఆక్రమణలు, సేకరించాల్సిన భూమి ఇలా పూర్తిస్థాయి వివరాలతో నివేదిక అందిన తర్వాత దీనికి జాతీయ రహదారిగా అనుమతి లభించటంతో ఇక పనులు చేపట్టే బాధ్యతను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చూస్తుందని జిల్లా ర.భ. శాఖ అధికారులు తెలిపారు. 81 కి.మీ. దూరం పరిధిని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగించటం, అదే సమయంలో దాని అభివృద్ధికి సంబంధించిన సర్వే పనులు నిర్వహించటం ఒకే సమయంలో జరుగుతుందంటున్నారు. రెండు పనులు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలనేది రెండు విభాగాల అధికారుల ప్రాథమిక లక్ష్యం. 

Leave a Reply