చిలకలూరిపేట రాష్ట్రమంతటికీ స్ఫూర్తి

వాణిజ్య కూడలిగా అభివృద్ధి
రూ.850 కోట్లతో బైపాస్‌ నిర్మాణం
తాగునీటి పథకం ఏర్పాటుకు హామీ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీప పట్టణం.. పట్టణం మీదుగా కలకత్తా- చెన్నై జాతీయ రహదారి వెళ్తుండడం… స్పిన్నింగ్‌ మిల్లులకు కేంద్రం.. మిరప, పొగాకు, పత్తి పంటల కూడలిగా ఉన్న చిలకలూరిపేటను వాణిజ్య కూడలిగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం 2.15గంటలకు హెలిక్యాప్టర్‌లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వయ్‌లో బయలుదేరి పురుషోత్తపట్నంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం కేంద్రమంత్రి వెంకయ్యతో కలసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 18, 19 శతాబ్దాల్లో చిలకలతోటగా ఉన్న పేరు కాలక్రమంలో చిలకలూరుగా.పురుషోత్తపట్నంగా .. ప్రస్తుతం చిలకలూరిపేటగా మారిందని చరిత్రను గుర్తుచేసి ప్రజలను ఉత్సాహపరిచారు. చిలకలూరిపేటలో 25,500 మరుగుదొడ్లు నిర్మించిన జిల్లా యంత్రాంగం పట్టణాన్ని స్వచ్ఛ చిలకలూరిపేటగా మార్చి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛభారత్‌కు నాంది పలికిందన్నారు. ఇందుకు కృషిచేసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. రూ.2కోట్లతో మోడల్‌ పోలీసుస్టేషన్‌ బాగా నిర్మించారని, పోలీసులు కూడా స్మార్ట్‌గా పనిచేయాలని సూచించారు.

2022 నాటికి అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేటకు 4512 ఇళ్లు మంజూరుచేశామన్నారు. సొంత ఇళ్లు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తాయన్నారు. ధనవంతులు నివసించే కాలనీల వలే అందరికీ ఇళ్లు పథకం కింద నిర్మించి విలువ పెరిగేలా చూస్తామన్నారు. సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే ధీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని సీఎం వివరించారు. ప్రతిపక్షంపై విమర్శ చేస్తూ రెండేళ్ల కిందటితో పరిస్థితులతో ప్రస్తుత అభివృద్ధిని పోల్చి చూసుకుని ప్రజలు సహకరించాలన్నారు. పారిశ్రామిక, సేవల రంగాలు అభివృద్ధి చెందినప్పుడే ఉపాధి అవకాశాలు లభించి జీవనప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు. విదేశాల్లో రాష్ట్రానికి చెందిన లక్షమంది ఆదాయాన్ని ఆర్జిస్తూ ఇక్కడికి సొమ్ము పంపుతున్నారని గుర్తుచేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తూనే భారం తగ్గించడానికి ఎల్‌ఈడీ బల్బులను వినియోగంలోకి తెచ్చామన్నారు. ఫైబర్‌ కనెక్టివిటీ ద్వారా రూ.150లకే అంతర్జాలం, టెలివిజన్‌, టెలిఫోన్‌ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. చిలకలూరిపేటలో రోడ్లు ఒకప్పుడు అధ్వానంగా ఉండేవని, అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. రూ.850 కోట్లతో రెండేళ్లలో బైపాస్‌ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు.

తాగునీటి పథకానికి ప్రతిపాదనలు ఇచ్చారని, పరిశీలించి నిధుల విడుదలకు కృషిచేస్తానన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వారు కూడా ఇక్కడ ఎక్కువమంది వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. ప్రజలు స్వచ్ఛంగా ఉండటంతోపాటు పరిసరాలు, పట్టణం స్వచ్ఛంగా ఉంచుకున్నప్పుడే స్వచ్ఛభారత్‌ సాధ్యమవుతుందన్నారు. పట్టణప్రాంతాల్లో కేంద్రం తరఫున చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు.

మండుటెండలో సుడిగాలి పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మధ్యాహ్నం 2.15గంటలకు చిలకలూరిపేటకు చేరుకుని సాయంత్రం 4.15 గంటలకు కార్యక్రమాలు ముగించుకుని రోడ్డుమార్గాన గన్నవరం వెళ్లారు. పర్యటన మొత్తం మధ్యాహ్నం కొనసాగడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దారి వెంబడి ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. చంద్రబాబు కాన్వాయ్‌ పయనించే మార్గంలో ఇరువైపులా ప్రజలు బారులు తీరి స్వాగతం పలికారు. మసీదు వద్ద ముస్లిం మతపెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావును వెండి కిరీటాలతో సత్కరించారు.

మండుటెండలో సైతం జనం హాజరు ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు ఉత్సాహంగా మాట్లాడుతూ ప్రసంగంలో యువత, పేట ప్రజల ఉత్సాహాన్ని ప్రస్తావించారు. కార్యక్రమంలో శాసనసభాపతి కోడెలశివప్రసాద్‌రావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ షేక్‌ జానీమూన్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఇక్కుర్తి సాంబశివరావు, తెదేపా నేత జేఆర్‌ పుష్పరాజ్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.