స్వచ్ఛభారత్‌ కల సాకారం చేసుకోవాలి

కేంద్ర పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సుమారు రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిలకటూరిపేట పాతసంత వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం రూపురేఖలే మారిపోయాయని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో మోదీ, ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. 2019 నాటికి స్వచ్ఛభారత్‌ కలను సాకారం చేసుకోవాలని మోదీ సంకల్పించినట్లు చెప్పారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలు శుభ్రం చేసుకోవాలని సూచించారు. బ్యాకింగ్‌ రంగాన్ని పేదలకు దగ్గర చేసేందుకు మోదీ విశేష కృషి చేశారన్నారు. ఆయన సంకల్పంతో కేవలం ఆరు నెలల్లోనే 20 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల నిర్మాణం కోసం రూ.65 వేలకోట్లు మంజూరు చేసినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ కొత్త పథకం చేపట్టినా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 93వేల గృహాలను మంజూరు చేసినట్లు చెప్పారు.

Leave a Reply