చిలకలూరిపేటలో రాజకీయ చైతన్యం ఎక్కువ: చంద్రబాబు

చిలకలూరిపేటలో రాజకీయ చైతన్యం ఎక్కువని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాతసంత ప్రాంతంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చిలకలూరిపేటలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.

17-feb-2016-12

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు చిలకలూరిపేటలోనే నాంది పలికినట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న చిలకలూరిపేట పట్టణం భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో పట్టణంలో 20,500 మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్‌సిటీల తొలి జాబితాలో విశాఖ, కాకినాడ నగరాలు చోటు దక్కించుకోవడం విశేషమన్నారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో విశాఖ ఐదో స్థానంలో, విజయవాడ 23వ స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు. అమృత్‌ పథకం కింద 33 మున్సిపాలిటీలు ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబునాయుడు అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు పలు విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని… మరికొన్ని మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించి రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.6వేల కోట్లతో వృద్ధులకు, వికలాంగులకు రూ.వెయ్యి పింఛను ఇస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రేషన్‌ సరుకులను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తీసుకునేలా ఈ-పాస్‌ విధానం ప్రవేశపెట్టామని, పేదవారికి గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద అందరికీ ఉచిత వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply