మలుపుల బైపాస్‌లో తొలగిన అడ్డంకి

ఎన్‌హెచ్‌డీపీ ఫేజ్‌-5లో పేటకు బైపాస్‌ 
14.5 కి.మీ దూరం విస్తరణ ఉండదు 
హైకోర్టులో ఎన్‌హెచ్‌ఏఐ ప్రమాణపత్రం దాఖలు 
కేసును ముగించిన ఉన్నత న్యాయస్థానం

ఎన్నెన్నో మలుపులు.. మరెన్నో వివాదాలు.. పట్టణం మీదుగా జాతీయ రహదారి విస్తరణా..? బైపాస్‌ రహదారి నిర్మాణమా.. వ్యాపారులు నష్టపోవాలా.. రైతులు భూములు కోల్పోవాలా? పరిహారం ఎంతిస్తారు? భూసేకరణ భారం ఎవరు భరిస్తారు? 
ఇలా ఆరేళ్లుగా సాగుతున్న చర్చోపచర్చలకు హైకోర్టు ముగింపు పలికింది. బైపాస్‌ రహదారి వేస్తామన్న జాతీయ రహదారుల నియంత్రణ సంస్థ హామీని విశ్వసించి సుదీర్ఘంగా సాగుతున్న కేసును ముగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తానికి మలుపుల బైపాస్‌లో చివరి అడ్డంకి తొలగిపోయింది.

జాతీయ రహదారుల అభివృద్ధి పథకం (ఎన్హెచ్డీపీ) ఫేజ్-5 ద్వారా చిలకలూరిపేట వద్ద బైపాస్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో మొదటిసారిగా బైపాస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు, భూమి కొనుగోలుకు అంగీకరించింది.. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి తాతపూడి వరకు 82.5 కి.మీ దూరం చేపట్టిన ఆరు లైన్ల విస్తరణ ప్రాజెక్టులో యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నుంచి బొప్పూడి కోనాయికుంట వరకు 14.5 కి.మీ దూరాన్ని తొలగించాం. ఈ ప్రాజెక్టు ఇంతటితో ముగిసినట్లేనని జాతీయ రహదారుల నియంత్రణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఈనెల 8న ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. దీంతో ఇప్పటికే పలు మలుపులు తిరిగిన చిలకలూరిపేట బైపాస్ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లయింది. ప్రమాణ పత్రాన్ని పరిశీలించిన హైకోర్టు.. ప్రగతి పర్యావరణ పరిరక్షణ సమితి పిటిషన్లో పేర్కొన్న అంశాలకు ఇబ్బంది లేనందున ఈ కేసును ముగిస్తున్నట్లు తెలిపారని హైకోర్టు న్యాయవాది వి.లక్ష్మీనారాయణ తెలిపారు. తనకు న్యాయం జరగలేదని భావిస్తే పిటిషినర్ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తీర్పులో పేర్కొన్నారన్నారు.

తొలగిన అడ్డంకులు  చిలకలూరిపేట బైపాస్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటం, న్యాయస్థానంలో కేసు కొలిక్కి రావడంతో అడ్డంకులు తొలిగిపోయాయి. రెండున్నరేళ్ల వ్యవధిలో తిమ్మాపురం వద్ద నుంచి బొప్పూడి కోనాయికుంట వరకు 14.5 కి.మీ పొడవునా బైపాస్ రహదారి నిర్మాణం పూర్తవుతుందని జాతీయ రహదారుల నియంత్రణ సంస్థ అధికారులు వివరించారు.

ఇలా మొదలైంది 
16వ నెంబరు జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణ పనులు 2007లో ప్రారంభమయ్యాయి. రహదారి విస్తరణలో భాగంగా ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ చిలకలూరిపేటలో ప్రజాభిప్రాయాన్ని సేకరించగా స్థా´నికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణంలో విస్తరణ తగదని.. బైపాస్‌ కావాలంటూ విన్నవించారు. అయితే బైపాస్‌ అవసరం లేదని, ప్రమాదాల నివారణకు ఆరులైన్ల విస్తరణ చేపడితే సరిపోతుందని సదరు సంస్థ కేంద్రానికి నివేధించింది. ఈక్రమంలో 2009 జులైలో విస్తరణ పనులు మొదలయ్యాయి. 2010 జనవరి 14న ఆరులైన్ల విస్తరణకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అదే ఏడాది ఫిబ్రవరి 9న చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రెవెన్యూ అధికారులు స్థలసేకరణ చేపట్టారు. అక్కడక్కడా కల్వర్టులు, రహదారి నిర్మాణాలు చేశారు. చిలకలూరిపేట మీదుగా ఆరు లైన్ల విస్తరణ చేపడితే ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, గతంలో జరిగిన ప్రమాదాలు, మృతుల సంఖ్యలతో కొందరు ప్రజాప్రతినిధులు, స్థానికులు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. ఎన్‌హెచ్‌ఎఐకు కూడా అన్ని వివరాలతో నివేదిక అందించారు. దీంతో పునరాలోచన మొదలయింది.

చిలకలూరిపేటకు బైపాస్‌ అవసరమంటూ 2010 అక్టోబరు 10న కేంద్రం 3ఎ నోటిఫికేషన్‌ జారీచేసింది. యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి కోనాయికుంట వరకు 14.5 కి.మీ పొడవునా బైపాస్‌ ఏర్పాటు చేయాలని భావించింది. దీనిపై ఆగ్రహించిన రైతులు బైపాస్‌ సర్వే పనులను అడ్డుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము భూములు కోల్పోతున్నామని, న్యాయం చేయాలని రైతులు ఫిర్యాదుచేయడంతో న్యాయస్థానం పనులపై స్టే విధించింది. అదే ఏడాది ఆగష్టు 23న బైపాస్‌ యోచన రద్దుచేసుకుంటున్నామని జాతీయ రహదారుల నియంత్రణ సంస్ధ అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. పట్టణం మీదుగా విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించి కల్యాణి హోటల్‌ వద్ద స్థలసేకరణ సర్వే చేపట్టిన అధికారులను బైపాస్‌ అనుకూల సమితి నాయకులు అడ్డుకున్నారు. ఈ సమితి సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అదే ఏడాది 2010 సెప్టెంబరు 26న ఆరులైన్ల విస్తరణపై స్టే విధించింది. ఇటు బైపాస్‌ అటు విస్తరణపై స్టే ఉండడంతో అయోమయం నెలకొంది. కేసులు న్యాయస్థానంలో ఉండగానే 2015లో పట్టణం మీదుగా రహదారి విస్తరించాలని నిర్ణయించి భూసేకరణకు ప్రకటన విడుదల చేశారు. జాతీయ రహదారికి రెండు వైపులా 14.5 కి.మీ. పొడవునా 16.42 హెక్టార్ల భూమి సేకరిస్తామని ప్రకటించారు. అందులో 13.42 హెక్టార్లుకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. భూసేకరణకు అభ్యంతరం తెలుపుతూ 90 శాతం మంది నరసరావుపేట ఆర్డీవోకు అప్పట్లో వినతులు అందజేశారు. ఈ నేపథ్యంలోనే బైపాస్‌ వ్వవహారంపై ప్రగతి పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు వలేటి హిమంతరావు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి న్యాయస్ధానంలో బైపాస్‌ వ్యవహారం నానుతూనే ఉంది.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు రూ.800 కోట్లతో చిలకలూరిపేటకు బైపాస్‌ రహదారి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో సందిగ్ధం తొలగిపోయింది. అయినా న్యాయస్థానంలో కేసు ఉన్నందున తుది తీర్పు ఎలా వస్తుందోననే అనుమానాలు కొనసాగాయి. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చిలకలూరిపేట బైపాస్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జులై లోపు డీపీఆర్‌ నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈవివరాలతోనే ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఈనెల 8న ప్రమాణపత్రం ద్వారా దాఖలు చేసింది. దీంతో కేసు ముగించామని కోర్టు ప్రకటించింది. 

Leave a Reply