పేట బైపాస్‌ రహదారికి పచ్చజెండా

ఆరు లైన్ల విస్తరణ లేనట్లే!
జూలై లోపు డిపిఆర్‌ అందజేయాలని ఆదేశం 

చిలకలూరిపేట బైపాస్‌ రహదారికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దుర్గమ్మ సన్నిధి చెంత పైవంతెన పనులను ప్రారంభించేందుకు ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ చిలకలూరిపేటకు రూ.800 కోట్లతో బైపాస్‌ రహదారి నిర్మిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండురోజుల క్రితం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బైపాస్‌కి ఆమోదం లభించింది. 2016 జులై లోపు డిటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డిపిఆర్‌) అందజేయాలని సంబంధిత కన్సల్టెన్సీని రవాణా ఆదేశించింది. దీంతో పట్టణం గుండా వెళ్తున్న ఆరు లైన్ల రహదారి విస్తరణ లేనట్లే. యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నుంచి బొప్పూడి కోనాయికుంట వరకు 16.48 కి.మీ పరిధిలో బైపాస్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. బైపాస్‌ నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ గతంలోనే మూడు ఎలైన్‌మెంట్లు రూపొందించగా ఒకటి ఆమోదించారు. ప్రస్తుతం దానిని కొనసాగ���స్తారా…? కొత్త ఎలైన్‌మెంట్‌ రూపొందిస్తారా అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బైపాస్‌ రహదారికి 339 ఎకరాలు అవసరమని కూడా ప్రకటించారు. దేశంలోనే మొదటిసారి జాతీయ రహదారి నిర్మాణంలో భూసేకరణకు సంబంధించి అయ్యే ఖర్చులో 25 శాతం రాష్ట్రప్రభుత్వం భరించనుంది. ఈమేరకు కేంద్రానికి లేఖ కూడా అందించింది.

7వ ప్రాజెక్టులోనే ఆమోదం 
జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ పనులు ఎన్‌హెచ్‌-5వ ప్రాజెక్టులో ప్రారంభమయ్యాయి. విజయవాడ కనకదుర్గమ్మ వారధినుంచి చిలకలూరిపేట మండలంలోని తాతపూడి వరకు 83 కి.మీ పనులు కూడా 5వ ప్రాజెక్టులోనే జరిగాయి. అది పూర్తికావడంతో ప్రస్తుతం నడుస్తున్న ఎన్‌హెచ్‌-7వ ప్రాజెక్టులో చిలకలూరిపేట బైపాస్‌ రహదారి పనులు జరగనున్నాయి. 

 

Leave a Reply