రహదారి విస్తరణ ఉపసంహరణ

చిలకలూరిపేట జాతీయ రహదారిపై హైకోర్టుకు తెలిపిన ఎన్‌హెచ్‌ఏఐ రాతపూర్వకంగా తెలుపాలన్న ధర్మాసనం

చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌) విస్తరణ పనులను ఉపసంహరించుకున్నామని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) హైకోర్టుకు తెలిపింది. ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ అంశంపై రాతపూర్వక వైఖరి తెలపాలంటూ ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. చిలకలూరిపేటలోని నాలుగులైన్ల జాతీయ రహదారిని ఆరులైన్లకు విస్తరించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిర్ణయించారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో పట్టణం వెలుపల నుంచి బైపాస్‌ వేయాలని నిర్ణయిస్తూ 2010లో ప్రకటన జారీచేశారు. తదనంతరం 2011లో బైపాస్‌ రోడ్డు పనులను అధికారులు ఉపసంహరించుకున్నారు. పట్టణంలోని నాలుగులైన రోడ్లను ఆరులైన్లుగా విస్తరించడానికి నిర్ణయించారు. అధికారుల చర్యలను సవాలు చేస్తూ.. ప్రగతి పర్యావరణ పరిరక్షణ సమితితో పాటు మరో ఇద్దరు 2013లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం తాజాగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. ఎన్‌హెచ్‌ఏఐ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విస్తరణ పనులను ఉపసంహరించుకున్నామని కోర్టుకు తెలిపారు. బైపాస్‌ ఏర్పాటు అంశం ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అంశమన్నారు. ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఉపసంహరణపై వైఖరిని రాతపూర్వకంగా తెలియజేస్తే.. వ్యాజ్యంపై విచారణను ముగిస్తామని మౌఖికంగా తెలిపింది.

Leave a Reply