క్రీ|శ||18వ శతాబ్దము
కాల గమనంలో ప్రజలు పెత్తందార్ల నాయకత్వంలో బ్రతుకుతున్న రోజులు. గ్రామంలో పెత్తందార్లుగా అధికారం చెలాయిస్తూ ప్రజానీకాన్ని ప్రేమాభిమానాలతో అక్కున చేర్చుకునే సంస్కృతి ఆరోజుల్లో పురుహూత్తమపట్టణములో నెలకొనివున్నది.
రెండు మతాలు అన్యోన్యంగా కలసిమెలసి సహజీవనం సాగించిన ఘన చరిత్ర ఈ గ్రామానికి కలదు. ఈ గ్రామమును రెండు భాగములుగా విభజించగా ఒక భాగం హిందువులు – రెండవ భాగం మహమ్మదీయులు. ఎలాంటి ఘర్షణలు లేకుండా ఈ రెండు మతాల ప్రజలు నేటికీ సఖ్యతతో వుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. హిందువులలో తెలగ, కుమ్మరి, యాదవ, విశ్వబ్రాహ్మణ, మంగలి, ఏరుకుల కులాలకు చెందినవారు వారు వారి వృత్తులలో నైపుణ్యాన్ని చూపుతూ సహజీవనం చేస్తున్నారు.
18వ శతాబ్దిలో తోట లింగప్ప గారి కుమారుడు కృష్ణమ్మ గారి కాలములో ” రుక్మిణీ- సత్యభామా సమేత శ్రీవేణుగోపీనాధస్వామి ” దేవాలయము నిర్మించబడినది. ఆ రోజులలో తోటవారి వంశములో ఎక్కువ మంది తహశీల్దారులుగా ఉన్నతోద్యోగములను చేసినారు. వారి పలుకుబడి, అధికారమును ఉపయోగించి కొండవీడులో శిధిలమైపోయిన శివాలయం భాగమును పురుషోత్తమపట్టణమునకు చేర్చి వేణుగోపీనాధస్వామి ఆలయమును నిర్మించిరి.
పురుషోత్తమపట్టణమునకు 30కి|| మీ|| దూరములోనున్న ” బల్లికురవ ” గ్రామంలో లభించిన గోపీనాధస్వామిని రుక్మిణీ సత్యభామలతో సహా తీసుకొని వచ్చి ఈ ఆలయమున ప్రతిష్టించిరి. ఆ తదుపరి, కొండవీడులోని శ్రీగోపీనాధ స్వామి వారి కళ్యాణమండపమును త్రవ్వి తీసుకునివచ్చి ఇక్కడ నిర్మాణము చేసినట్లు కొండవీడు చరిత్రలో లిఖించబడియున్నది.
ఈ మంటపము అద్భుతమైన శిల్పసౌందర్యముతో విరాజిల్లుచూ చూపరులను ఆశ్చర్యచకితులను చేయుచున్నది. స్వామి వారి విశేష సేవలకు, అంగరంగవైభవములు జరుగుటకు జమీందార్లు 360 యకరముల భూమిని తోటకృష్ణమ్మ అధీనమున ఉంచినట్లు చరిత్రకాధారలు తెలియజేయుచున్నవి.
అటు పిమ్మట తోట లింగప్ప వంశీకులు, మరియు వారి దాయాదులైన తోటవారు వంశపారంపర్యముగా ఈ ఆలయమునకు ధర్మకర్తలుగా వ్యవహరించుచున్నారు. శ్రీస్వామి వారి ఉత్సవములు వైభవముగా జరుగును. చరిత్ర ప్రసిద్దిగాంచిన దేవాలయముగా శ్రీవేణుగోపీనాధస్వామి దేవాలయమును గురించి చుట్టు ప్రక్కల గ్రామస్తులు తరచుగా చర్చించుకోవడం గమనార్హం. ఇక మహమ్మదీయుల సోదరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలాంటి మత ఘర్షణలకు చోటివ్వని ఉన్నతమైన వ్యక్తిత్వాలు వారివి. అన్న, బావ, అక్క, చెల్లి, లాంటి వరుసలతో సంభోదిస్తూ ఐక్యతా రాగాన్ని ఆలాపించే మనసులు వారివి.
ఉన్నతమైన శిల్పకళను అధ్యయనం చేసి, అద్భుతమైన శిల్పసంపదను ఈ రాష్ట్రానికి సమర్పించిన ఘన చరిత్ర ఈ గ్రామానికి చెందిన మహమ్మదీయ సోదరుల సొంతం. ప్రముఖమైన హిందూదేవతల విగ్రహములను కళాత్మకంగా చెక్కిన ఘనత ఈ గ్రామానికి చెందిన మహాశిల్పి శ్రీషేక్ ఇస్మాయిల్ గారికే చెందుతుంది. భారతదేశంలోని ప్రముఖులచే ఎన్నో సత్కారాలు పొందిన గణనీయమైన చరిత్ర ఇస్మాయిల్ గారికి వున్నది. ఇస్మాయిల్ గారి తదుపరి వారసత్వమును స్వీకరించిన ప్రముఖశిల్పి కళాకారులు శ్రీయుతులు షేక్ ముక్రుంమియా, షేక్ బడేమియాలు సైతం ఈ కళలో కీర్తిని గడించారు. ఆయన శిష్యులు ఎందరో ఈనాడు ఆధారంగా చేసుకొని జీవనం కొనసాగించుచున్నారు.
మహమ్మదీయులు నివసించే ప్రాంతంలో 3 పెద్ద మసీదులు నిర్మించబడినాయి. ముస్లింల పర్వదినాల సందర్భంగా ఈ మసీదులు విద్యుద్దీపాల అలంకరణతో వెలగిపోతుంటాయి. హిందువులు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పి ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ఇక్కడి సాంప్రదాయం. యాదవులు గొర్రెలు పెంపకంలో సిద్ద హస్తులు, కుమ్మరి కులస్తులు కుండల తయారీలో నైపుణ్యం గలవారు. వీరు గ్రామదేవతలైన పోలేరమ్మ, అంకమ్మ తల్లి దేవాలయాలకు పూజారులుగా వ్యవహరించడం సంప్రదాయంగా నేటికీ కొనసాగుతుంది.
కొన్ని ఎరుకల కుటుంబాలు బుట్టలు, తట్టలు అల్లి బ్రతుకు తెరువును కొనసాగిస్తున్నారు. ఈనాడు ప్రభుత్వ సహాయ సహకారంతో ఉన్నతమైన విద్యనభ్యసించి ఉద్యోగాలలో స్థిరపడినారు.
వైశ్యులు చిలకలూరిపేట పట్టణంలో ప్రముఖ వ్యాపారులుగా గుర్తింపును పొందియున్నారు. బ్రాహ్మణులు పూజారులుగా ఉన్నతోద్యోగులుగా స్థిరపడినారు. విశ్వబ్రాహ్మణులు (కంసాలి) చేతివృత్తులతో సంతృప్తిపడటమే గాక, ప్రభుత్వ ఉద్యోగములలో సైతం కొనసాగుచున్నారు.