విద్యాదాతలు
ఈ గ్రామములో బాపూజీ విద్యావిధానమును అనుసరించి 1954లో తోటా వెంకటక్రష్ణమ్మ, తోట రామకోటేశ్వరరావులు శ్రీ తోట పుల్లప్ప బేసిక్ ట్రయినింగ్ స్కూలును స్థాపించారు. తోట పుల్లప్ప తాతగారి వారసులలో ప్రముఖులైన తోట రామకోటేశ్వరరావు గారి నేతృత్వంలో, బైరా ప్రసాదరావు గారు ప్రధానోపాధ్యాయులుగా ఈ విద్యాలయము విజయపధం వైపు పురోగమించింది.
క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఈ సంస్థ నుండి రావడం జరిగింది. అటు పిమ్మట బేసిక్ ట్రయినింగ్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత తోట రామకోటేశ్వరరావు గారు ఏకైక పుత్రిక శ్రీమతి బైరా లక్ష్మీ శివసాగర్ గారి నేతృత్వంలో ఈ విద్యాలయం “శ్రీ పుల్లప్ప తోట రామకోటేశ్వరరావు మెమోరియల్ హైస్కూల్” గా రూపాంతరం చెందినది. గ్రామంలోని ఆడ పిల్లలకు, పరిసర గ్రామాలైన పోతవరం, మద్దిరాల, యడవల్లి, బొప్పూడి, కట్టుబడివారిపాలెం, గోపాళంవారి పాలెం తదితర గ్రామాల బాలబాలికలకు ఈ పాఠశాల కల్పవృక్షంగా మారింది. ఈ పాఠశాల కమిటీకి శ్రీ తోట భరతుడు గారు అధ్యక్షునిగా, శ్రీమతి బైరా లక్ష్మి శివసాగర్ గారు సెక్రెటరీ మరియు కరస్పాండెంట్ గా వ్యవహరించారు. కీ. శే. లు తోట పుల్లప్ప తాతగారు దానం చేసిన భూములపై వచ్చే ఆదాయం మరియు ప్రభుత్వం వారి నిధులతో ఈ విద్యాసంస్థ విజయవంతంగా నడుస్తోంది.